Wednesday 19 June 2013

టామ్ వి నిజంగా కాకి లెక్కలేనా..?


టామ్ కీ బ్రాడ్ కాస్టర్లకూ మధ్య నెలకొన్న వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఎమ్ ఎస్ ఎమ్, టిటిఎల్ తమ సభ్యత్వాల్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించి టామ్ కి లేఖలు రాసినదగ్గరినుంచి అస్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది. ఎన్డీటీవీ ఓ అడుగు ముందుకేసి న్యూయార్క్ సుప్రీంకోర్ట్ లో ఓ కేసు కూడా ఫైల్ చేసింది.
జూన్ పదోతారీఖుకల్లా ఇండస్ట్రీ మొత్తం ఈ వార్త పాకిపోయింది. ఛానెళ్లన్నీ ఒక్కతాటిమీదకొచ్చి టామ్ చందాల్ని ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్నాయి. అడ్వర్టైజర్లు ఈ స్థితిలో టామ్ కి అండగా నిలబడ్డారు. బ్రాడ్ కాస్టర్లకు ప్రకటనల్ని అందించే మీడియా ప్లానర్లు రంగం ప్రవేశం చేశారు.
బ్రాడ్ కాస్ట్రర్లు మాత్రం రాయబారానికికూడా ఛాన్సివ్వడంలేదు. టామ్ లెక్కలు తప్పుల తడకలన్న విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఆ సంస్థనే పట్టుకుని కూర్చోవడం సరైన పద్ధతి కాదని బ్రాడ్ కాస్టర్లు భావిస్తున్నారు. సొంతగా మరో సంస్థని ఏర్పాటు చేసుకుని రేటింగుల లెక్కల్ని చూసుకోవాలని అన్ని ఛానెళ్లూ పట్టుబడుతున్నాయి.
ఈ దిశగా కొత్త ప్రయత్నాలుకూడా మొదలయ్యాయి కానీ.. రేటింగుల్ని లెక్క గట్టే కొత్త సంస్థ పుట్టుకురావడానికి మరో ఏడాది సమయం పడుతుందని చూచాయగా అందరూ అనుకుంటున్నారు. అప్పటిదాకా ఆగాలంటే చాలా లేటైపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతిష్ఠంబనని తొలగించే మార్గంకూడా ఏదీ కనిపించడంలేదు.
ఛానెళ్ల సత్తానిబట్టి, కార్యక్రమాల నాణ్యతను ప్రజల్లో వాటికున్న ఆదరణనుబట్టి రేటింగుల్ని అంచనా వేసుకుని ప్రకటనలు ఇవ్వాలని బ్రాడ్ కాస్టర్లు పట్టుబడుతున్నారు. కానీ.. టామ్ ని పూర్తిగా మట్టిలో కలిపేయడానికి తాము ఏమాత్రం ఒప్పుకునేది లేదని అడ్వర్టైజర్లు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.
మొదట్లో టామ్ లెక్కలు అందరికీ చాలా క్రేజీగా ఉండేవి.. రేటింగులు అమాంతంగా అలా గాల్లో కనిపిస్తుంటే మా చానెల్ గొప్పదంటే మా చానెల్ గొప్పదని అంతా చంకలుగుద్దుకునేవాళ్లు.. రాను రాను రేటింగులాటలో చివరికి పావులుగా మారింది ఛానెళ్లే అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత బ్రాడ్ కాస్టర్లమైండ్ సెట్ మారింది.
టామ్ అందిస్తున్న లెక్కలు నిజాయతీతోకూడుకున్నవి కాదన్న అనుమానం చాలా ఛానెళ్లకు కలిగింది. ఈ అపవాదు చాలాకాలంగా వినిపిస్తూనే ఉందంటూ టామ్ కొట్టిపారేసింది. కానీ.. ఛానెళ్లుమాత్రం టామ్ కార్యకలాపాలమీద, లెక్కలమీద ఓ కన్నేసి ఉంచాయి. చివరికి అంతా కలిసి టామ్ ని బాయ్ కాట్ చేశారు.
ఇరువర్గాలనూ చల్లబరిచే దిశగా కొందరు అడ్వర్టైజర్లు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదు. టామ్ తన పనితీరుని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా బ్రాడ్ కాస్టర్లుమాత్రం ముందడుగు వేయడానికి సిద్ధంగా లేరు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదేనని కొందరు బ్రాడ్ కాస్టర్లు టామ్ మీద కామెంట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment