Wednesday 19 June 2013

||నగు మోము గన లేని నా జాలిఁ దెలిసీ..||

మబ్బులెనక జాబిలమ్మలెన్నో..
ముక్కలు-ముక్కలు గా కదిలొస్తున్నట్టు..
ఆకాశంలో సగభాగాన్ని కప్పేసి
చందమామ కొంటెగా చూస్తున్నట్టు..
ఘోషా సౌందర్యానికి
జవనాశ్వాల వేగాన్ని అద్ది..
రాజధాని నగరంలో
రయ్యన దూసుకు పోతున్నాయి
రెండు చక్రాల రథాలు
మేలిముసుగుల పరదాకి
కాలుష్యం .. మిష
మరి కారణాలు
వెనక్కిపోయే పొగలో కానరావు
విషయం ఏదైనా కానీ..
దాగి ఉన్నదెప్పుడూ
మేలిమి అందమేగా!!
అలా అనుకోవడంలోనే ఉంది
హమేషానిషా
ఇదే ఒకందుకు మంచిదేమో..
నా దుశ్శాసన మనసు కేవలం
ముసుగులోన ముఖాన్ని మాత్రమే
చూడాలని కోరుతుందిప్పుడు..
సిగ్నల్ దగ్గర ఒక పరదా పరిందా*
ఆగి ఆగకుండా.. చూపులు గుచ్చి
తుర్రుమన్నప్పుడు..
గుండె మెటికలు విరుచుకున్న చప్పుడు…..
YOU CAN VISIT                      http://blaagu.com/sateesh/

ఆమె

ప్రేమకాంతి నా రోజుల్ని వెలిగిస్తున్న ఒక సాయంత్రం ఆమె అడిగింది
నేను మీకు అబద్దాలు చెప్పాననీ, మిమ్మల్ని మోసం చేసాననీ
మీకు అనిపించిన రోజున ఏమి చేస్తారు, నాపై కోపం వస్తుందా

నా చివరి సాయంత్రపు, చివరి బంగారు కిరణాలు
నన్ను చీకటికి అప్పగించి సెలవుతీసుకొంటున్నాయి

పరుచుకొంటున్న ప్రశాంత నిశ్శబ్దంలో ఒక పిట్ట కూసినట్టు
ఊహించనివైపు నుండి నాలో వాలిన మౌనంలోంచి ఒక్కొక్క మాట ఆమెతో అన్నాను

లేదు, నీపైన ఎప్పటికీ కోపం రాదు
నిజానికి కొన్ని తప్త క్షణాల్లో నిన్ను నా సహచరిగా భావించినా
నువ్వు ఎపుడూ నాకొక పసిపాపలా కనిపిస్తావు
నీ నిర్మలమైన చిరునవ్వు నన్ను ప్రాభాతకాంతిలా ఎన్నోసార్లు దు:ఖవిముక్తిడిని చేసింది
నీ చుట్టూ వలయం తిరిగి తాకిన చిరుగాలులు చల్లని నదీజలాల్లా తేలిక చేసాయి
నీ మాటలూ, వాటిమధ్య మౌనమూ  నను రోదసిలో విహరించే అన్వేషిని చేసాయి    
నా పేలవమైన సమయాలను నీ రూపం గొప్పదిగుల్లోకి పుష్పించేలా చేసింది

నీ పట్ల నాకు కృతజ్ఞత ఉంది
జీవితం నాకు ఇచ్చిన అన్ని కానుకలలోకీ గొప్ప కానుకవి నువ్వు
కానీ, ఒకటి చెప్పగలను, నువు నన్ను విడిచేరొజు సమీపించేకొలదీ
నీకు నేను, మరిచిపోలేని, విడిచిపెట్టలేని అపురూపమైన కానుకనవుతాను  
నన్ను విడిచివెళ్ళిన దు:ఖం నీ జీవితమంతా పరుచుకొంటుంది

ఆమె అంది, ఇది తీయని ప్రతీకారం
ఆమె చల్లని నవ్వుపై చీకట్లు వాలుతున్నాయి

నాలో తీయగానైనా ప్రతీకారకాంక్ష ఉందో, లేదో నాలోపల ఒకరికి తెలుసు
నాకు తెలుసు, ఆమె ఎక్కడ ఉన్నా నా మనిషి,
ఆమే, నేనూ వేరుకావటం ఆమె భ్రమ మాత్రమే అని

ఆమె వల్ల నేను ఏయే విశాల విశ్వాలకి మేలుకొన్నానో, విస్తరించానో
ఆమెకి తెలియదు ఇంకా, తానొక పసిపిల్ల కదా

జీవితం ఒక మొరటుస్పర్శ చాలాసార్లు
తాను నానుండి వెళ్ళిపోయాక ఆమెని జీవితమెలా లోబరుచుకొంటుందో నాకు తెలుసు
ఎందరిని చూడలేదు, కేవలం ధూళిలా, రాలిపోయిన పూలలా బ్రతుకుతున్నవాళ్ళని
ఆమెలో నేనొక మరువలేని సంతోషం మిగిల్చే మరువలేని దు:ఖాన్ని ప్రవేశపెట్టకపోతే
ఆమె జీవితం మాయలో ఎలా దారితప్పుతుందో
ఎలా వెలిసిపోయిన చిత్రపటంలా మిగులుతుందో నాకు తెలుసు, ఆమె ఒక పసిపిల్ల కదా

చీకటి ముసురుకొంది
చీకటి కన్నులు చెమరించినట్లు నక్షత్రాలు ఒక్కొక్కటీ మెరుస్తున్నాయి
అవి చిన్నిచిన్ని చినుకులు కావనీ, ఒక్కొక్కటీ నా జీవితం పట్టనంత కాంతిలోకాలనీ
నా కన్నులనుండి జారేందుకు వెనుకాడుతున్న కన్నీటిబిందువు చెప్పింది

ఆమె వెళ్ళిపోయింది, నువ్వైనా నాతో ఉండవా అనబోతున్నానని ఆ బిందువుకి తెలిసినట్లుంది

ఆమె ఉంటే జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని
ఆమెలేని దిగులు నన్ను మరింత దయలోకీ, కాంతిలోకీ నడిపించింది
తన వెలితిని నింపుకొనేందుకు అప్పటినుండీ విరామమెరుగక వికసిస్తూనే ఉన్నాను  
 
ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూడాలని చాలాసార్లు అనిపిస్తుంది
అప్పుడు
పూలపై వాలిన మంచుబిందువులూ, పక్షుల రవాలూ, సెలయేటిపరుగూ,
మనుషుల చిరునవ్వులూ, దు:ఖితులపై ఎవరోఒకరు కురిపించే దయా
లోకం నన్నుతాకే మృదువైన సమయాలన్నీ ఆమె మాలో లేదా అని నవ్వుతాయి  

  http://bvvprasad.blogspot.in/
 

                  సర్క్యులేషన్ లో దూసుకెళ్ళిన ఈనాడు



దేశంలోని దినపత్రికల ఆడిట్ చేసిన సర్క్యులేషన్ వివరాలను తెలిపే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC) వారు జులై – డిసెంబర్ 2012కు గడచిన అర్ధ సంవత్సరకాలానికి ఇటీవలే వెల్లడించిన  తెలుగు పత్రికల సర్క్యులేషన్ గణాంకాల రిపోర్టులో ఈనాడు పత్రిక అనూహ్యంగా 31,035 ప్రతుల సర్క్యులేషన్ పెరిగి 17,37,086 ప్రతులకు చేరుకోగా, ఆంధ్రజ్యోతి సర్క్యలేషన్ 22,769 ప్రతులు తగ్గి 6,03,857 వద్ద స్థిరపడగా సాక్షి సర్క్యులేషన్ 62,110 కాపీలు తగ్గి 13,38,845 కు పడిపోయింది.
abc-telugunewschannels 
తిరోగమన దిశలో సాక్షి సర్క్యులేషన్  -  క్షీణించిన ఆంధ్రజ్యోతి
సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు రెండూ తిరోగమన దిశలో పయనించగా, కొత్త ABC గణాంకాలు సాక్షి పత్రిక ఎదుగదలకు సవాలుగా కూడా నిలిచాయి. రెండూ, మూడూ స్థానాలలో ఉన్న తెలుగు పత్రికలు తమ సర్క్యులేషన్ పడిపోతున్న తరుణంలో ఈనాడు సర్క్యులేషన్ 31,035 వేల కాపీలు పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పెరుగుదలను విశ్లేషిస్తే హైదరాబాద్ సిటీలో 27,440 కాపీలు పెరిగి 4,32,652కు చేరుకోగా ఆ పత్రికకు సర్క్యులేషన్ పరంగా తెలంగాణాలోని మరో ప్రధాన కేంద్రమయిన కరీంనగర్లో 5,216 ప్రతులు పెరిగి 95,322 సర్క్యులేషన్కు చెరుకుంది. ఈనాడు సర్క్యులేషన్ గత అర్ధ సంవత్సరంతో పోల్చితే విజయవాడలో 8,951 కాపీలు, రాజమండ్రిలో  5,901 కాపీలు, నెల్లూరులో 5,155 కాపీలు తగ్గినది.
సాక్షి విషయానికోస్తే హైదరాబాద్ సిటీలో 18,318 కాపీలు, విశాఖపట్నం 7,052 కాపీలు, తాడేపల్లి గూడెం 5,799 కాపీలు విజయవాడలో 4,039 కాపీలు తగ్గింది.  సర్క్యులేషన్ పరంగా ఇప్పటికీ సాక్షి ఈనాడు కంటే తిరుపతి, ఓంగోలు, కడపలలో ముందంజలో ఉండటం గమనించదగ్గ విషయం. 2008లో ప్రారంభమైన సాక్షి పత్రిక 2009 చివరి అర్ధ సంవత్సరంలోనే ఈనాడు కంటే కేవలం 56 వేలు సర్క్యులేషన్ లో వెనకబడగా ఆ తేడా ఇప్పుడు నాలుగు లక్షలకు పెరగడం చూస్తే ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్న సామెత గుర్తుకోస్తుంది. ఆంధ్రజ్యోతి కూడా గత రెండు అర్ధ సంవత్సరాలలో సర్క్యులేషన్ పరంగా వృద్ధి నమోదు చేసుకున్నప్పటికీ ఈ సారి పడిపోవడంతో 6 లక్షల వద్దనే ముగిసింది.
పెరుగుదల – తగ్గుదల వివరాలు
ఆంధ్రజ్యోతి
జూలై – డిసెంబర్ 2012                                                     ABC CIRCULATION FIGURES
Add caption
6,03,857
జనవరి – జూన్ 2012
6,26,626
ఈనాడు
జూలై – డిసెంబర్ 2012
17,37,086
జనవరి – జూన్ 2012
17,06,051
సాక్షి
జూలై – డిసెంబర్ 2012
13,38,845
జనవరి – జూన్ 2012
14,00,955

టామ్ వి నిజంగా కాకి లెక్కలేనా..?


టామ్ కీ బ్రాడ్ కాస్టర్లకూ మధ్య నెలకొన్న వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఎమ్ ఎస్ ఎమ్, టిటిఎల్ తమ సభ్యత్వాల్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించి టామ్ కి లేఖలు రాసినదగ్గరినుంచి అస్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది. ఎన్డీటీవీ ఓ అడుగు ముందుకేసి న్యూయార్క్ సుప్రీంకోర్ట్ లో ఓ కేసు కూడా ఫైల్ చేసింది.
జూన్ పదోతారీఖుకల్లా ఇండస్ట్రీ మొత్తం ఈ వార్త పాకిపోయింది. ఛానెళ్లన్నీ ఒక్కతాటిమీదకొచ్చి టామ్ చందాల్ని ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్నాయి. అడ్వర్టైజర్లు ఈ స్థితిలో టామ్ కి అండగా నిలబడ్డారు. బ్రాడ్ కాస్టర్లకు ప్రకటనల్ని అందించే మీడియా ప్లానర్లు రంగం ప్రవేశం చేశారు.
బ్రాడ్ కాస్ట్రర్లు మాత్రం రాయబారానికికూడా ఛాన్సివ్వడంలేదు. టామ్ లెక్కలు తప్పుల తడకలన్న విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఆ సంస్థనే పట్టుకుని కూర్చోవడం సరైన పద్ధతి కాదని బ్రాడ్ కాస్టర్లు భావిస్తున్నారు. సొంతగా మరో సంస్థని ఏర్పాటు చేసుకుని రేటింగుల లెక్కల్ని చూసుకోవాలని అన్ని ఛానెళ్లూ పట్టుబడుతున్నాయి.
ఈ దిశగా కొత్త ప్రయత్నాలుకూడా మొదలయ్యాయి కానీ.. రేటింగుల్ని లెక్క గట్టే కొత్త సంస్థ పుట్టుకురావడానికి మరో ఏడాది సమయం పడుతుందని చూచాయగా అందరూ అనుకుంటున్నారు. అప్పటిదాకా ఆగాలంటే చాలా లేటైపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతిష్ఠంబనని తొలగించే మార్గంకూడా ఏదీ కనిపించడంలేదు.
ఛానెళ్ల సత్తానిబట్టి, కార్యక్రమాల నాణ్యతను ప్రజల్లో వాటికున్న ఆదరణనుబట్టి రేటింగుల్ని అంచనా వేసుకుని ప్రకటనలు ఇవ్వాలని బ్రాడ్ కాస్టర్లు పట్టుబడుతున్నారు. కానీ.. టామ్ ని పూర్తిగా మట్టిలో కలిపేయడానికి తాము ఏమాత్రం ఒప్పుకునేది లేదని అడ్వర్టైజర్లు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.
మొదట్లో టామ్ లెక్కలు అందరికీ చాలా క్రేజీగా ఉండేవి.. రేటింగులు అమాంతంగా అలా గాల్లో కనిపిస్తుంటే మా చానెల్ గొప్పదంటే మా చానెల్ గొప్పదని అంతా చంకలుగుద్దుకునేవాళ్లు.. రాను రాను రేటింగులాటలో చివరికి పావులుగా మారింది ఛానెళ్లే అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత బ్రాడ్ కాస్టర్లమైండ్ సెట్ మారింది.
టామ్ అందిస్తున్న లెక్కలు నిజాయతీతోకూడుకున్నవి కాదన్న అనుమానం చాలా ఛానెళ్లకు కలిగింది. ఈ అపవాదు చాలాకాలంగా వినిపిస్తూనే ఉందంటూ టామ్ కొట్టిపారేసింది. కానీ.. ఛానెళ్లుమాత్రం టామ్ కార్యకలాపాలమీద, లెక్కలమీద ఓ కన్నేసి ఉంచాయి. చివరికి అంతా కలిసి టామ్ ని బాయ్ కాట్ చేశారు.
ఇరువర్గాలనూ చల్లబరిచే దిశగా కొందరు అడ్వర్టైజర్లు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదు. టామ్ తన పనితీరుని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా బ్రాడ్ కాస్టర్లుమాత్రం ముందడుగు వేయడానికి సిద్ధంగా లేరు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదేనని కొందరు బ్రాడ్ కాస్టర్లు టామ్ మీద కామెంట్లు చేస్తున్నారు.


Wednesday 11 January 2012

నలుగురికి పనికొచ్చే విషయాలు ఏవైనా పంచుకునేవారందరికి ఇదే నా ఆహ్వానం